: డేరా బాబా గుర్మీత్ కు పారిపోయే ప్లాన్ చెప్పిన పోలీసులు.. అరెస్టులు!
- ముగ్గురు పోలీసులు అరెస్ట్
- భద్రత వివరాలు, ఎలా తప్పించుకోవచ్చో చెప్పిన పోలీసులు
- ముగ్గురూ కలసి కుట్ర చేశారన్న అధికారులు
- మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం జైల్లో శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పారిపోయేందుకు కొందరు పోలీసులు ప్లాన్ చెప్పారట. ఈ విషయాన్ని తెలుసుకున్న హర్యానా పోలీసు శాఖ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో కానిస్టేబుల్ కలసి గుర్మీత్ ఎలా పారిపోవచ్చన్న విషయమై ప్రణాళిక రచించి, అతనితో చర్చించారని, ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఆయనకు పోలీసులు కల్పించిన భద్రత, తీసుకెళ్లే రూట్ తదితరాలను గుర్మీత్ కు చెప్పి, ఆయన పారిపోయేలా చూసేందుకు వీరు ముగ్గురూ కుట్ర చేశారని అధికారులు తెలిపారు. వీరిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై కస్టడీకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించనున్నామని అన్నారు. కాగా, ప్రస్తుతం గుర్మీత్ రామ్ రహీమ్, రోహ్ తక్ లోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన నిండుగా కామాన్ని తలకెక్కించుకున్న వ్యక్తని, శారీరక కలయిక కోసం తపిస్తున్నాడని, జైల్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.