: హిందూపురంలో కోట్లకు పడగలెత్తిన మట్కా బీటర్.. వ్యవహారంపై ఆరా తీసిన బాలయ్య
హిందూపురంలో ఓ సామాన్యుడు మట్కా బీటర్ గా అవతారమెత్తి, అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. అంతేకాదు, ఏకంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి ఓ ప్రముఖ దినపత్రికలో 'పురంలో ఒకే ఒక్కడు' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో, ఈ వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో ఫోన్ ద్వారా ఆరా తీసినట్టు సమాచారం. తన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున మట్కా వ్యాపారం జరుగుతోందా? అని ప్రశ్నించారట. అంతేకాదు పోలీసు ఉన్నతాధికారితో ఈ విషయంపై చర్చ కూడా జరిపారట. మరోవైపు పట్టణంలో జరుగుతున్న మట్కాపై జిల్లా ఎస్పీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో, మట్కా బీటర్లంతా పట్టణాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు పరారైనట్టు సమాచారం.