: మా వాళ్లకు కాస్తంతైనా విరామం ఇవ్వరా?: బీసీసీఐతో రవిశాస్త్రి


ఒకదాని తరువాత ఒకటి వరుసగా క్రికెట్ సిరీస్ లు ఉండటంపై భారత క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశాడు. విరామం లేకుండా ఆటగాళ్లు ఆడుతుండటం వల్ల అలసిపోతున్నారని, బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ సీఈఓ రాహుల్ జోహ్రీకి పంపిన వీడియో సందేశంలో శాస్త్రి వ్యాఖ్యానించాడు. తన ఆటగాళ్లకు సిరీస్ కు సిరీస్ కు మధ్య తగినంత విరామం ఇవ్వాలని ఆయన కోరాడు.

త్వరలో ఇండియాలో శ్రీలంక, దక్షిణాఫ్రికాలు పర్యటించనుండగా, రెండు సిరీస్ ల మధ్యా కేవలం నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉందని గుర్తు చేసిన రవిశాస్త్రి, ఊపిరి సలపని షెడ్యూల్ కూడదని సూచించాడు. ఇతర దేశాలు తగినంత విరామం తీసుకుని ఆడుతున్నాయని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు క్రిస్మస్ విరామాన్ని తీసుకునే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటాయని, బీసీసీఐ మాత్రం కనీసం దీపావళి సమయంలోనూ బ్రేక్ లేకుండా ఆడనుందని చెప్పాడు. కాగా, రవిశాస్త్రి సూచనలపై బీసీసీఐ చేతులెత్తేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున ప్రస్తుతం దాన్ని మార్చలేమని, భవిష్యత్తులో ఈ సూచనలు గుర్తుంచుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News