: వరదల కారణంగా మసీదులోకి నీళ్లు.. ప్రార్థనల కోసం గురుద్వారాకు ఆహ్వానించిన సిక్కులు!
వరదల కారణంగా మసీదులోకి నీళ్లు చేరడంతో ఈద్ ప్రార్థనలు చేసేందుకు ముస్లింలకు ఆటంకం ఏర్పడింది. దీనిని గుర్తించిన సిక్కులు వారిని ప్రార్థనల కోసం తమ గురుద్వారాకు ఆహ్వానించి పెద్ద మనసు చాటుకున్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిందీ ఘటన. రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో చమోలీలోని జోషీమఠ్‌లో ఉన్న ఓ మసీదు ఆవరణలోకి నీళ్లు వచ్చి చేరాయి. శనివారం బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు చేయాలనుకున్న ముస్లింలకు నీళ్లు అడ్డంగా మారాయి. అక్కడ ప్రార్థనలకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వారంతా నిరాశలో కూరుకుపోయారు.
ఏం చేయాలో తెలియక తలలుపట్టుకున్నారు. విషయం తెలిసిన స్థానిక సిక్కులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న తమ గురుద్వారాలో ఈద్ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో ముస్లింలందరూ ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు వెయ్యిమంది ముస్లింలు గురుద్వారా చేరుకుని ప్రార్థనలు పూర్తి చేశారు. అనంతరం ముస్లింలు మాట్లాడుతూ సిక్కులు చూపించిన అభిమానానికి తమ కళ్లవెంట నీళ్లు వచ్చినట్టు తెలిపారు. భాయి-భాయికి అసలైన నిర్వచనం ఇదేనని చెప్పుకొచ్చారు. సిక్కుల వల్లే తమ ప్రార్థనలు సజావుగా ముగిశాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.