: వైసీపీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవరపెడుతున్న వరుస ఘటనలు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అధినేతకు తగులుతున్న వరుస దెబ్బలు చూసి పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. నంద్యాల ఓటమి నుంచి తేరుకోకముందే కోర్టులో జగన్‌కు చుక్కెదురైంది. ఆ షాక్‌లో ఉండగానే కాకినాడ ఓటర్లు జగన్‌కు ఝలక్కిచ్చారు. రోజుల తేడాతో వరుసపెట్టి తగులుతున్న దెబ్బలు ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నంద్యాల ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాకినాడలో ప్రచారం చేసిన జగన్ అచ్చం నంద్యాల వ్యూహాన్నే ఎంచుకుని టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రానికి కాకినాడ ఎన్నికలు నాంది కావాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే కాకినాడ ఓటర్లు ఆయన మాటలను పక్కనపెట్టేశారు. ఘోరంగా ఓడించారు.
ఇక నంద్యాల ఓటమి తర్వాత నిరాశలో మునిగిపోయిన జగన్‌కు గురువారం హైకోర్టు షాకిచ్చింది. ఆయా కేసుల విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. హాజరు నుంచి మినహాయింపు కోసమే పాదయాత్రను తెరపైకి తెచ్చినట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. అక్టోబరు 27 నుంచి జగన్ ఒకవేళ పాదయాత్ర చేపట్టినా, ఆ సమయంలో ఎక్కడ ఉన్నా, శుక్రవారం మాత్రం కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థితి. ఇక తాజాగా కాకినాడ ఫలితం.. ఇలా వారం వ్యవధిలోనే మూడు ఘటనలు వైసీపీని కలవరపరుస్తున్నాయి.