and: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం... భారీ వర్షం

  • ఐదు గంటలకే తెలుగు రాష్ట్రాలను అలముకున్న చీకట్లు
  • నీట మునిగిన రాజమండ్రి, అన్నవరం
  • రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారుల ఇబ్బందులు
heavy rains in telangana and ap

ఎండ వేడిమితో అల్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలను మంగళవారం వర్షం పలకరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది. కొన్నిరోజులుగా ఎండవేడితో తాళలేకపోతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, కుమురంబీమ్ అసిఫాబాద్, ములుగు, జనగామ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ కోసం కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. నిన్నటి వరకు ఆరు దాటినా ఎండవేడి తగ్గని పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం ఐదు కాకముందే చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి సహా వివిధ పట్టణాలలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. అన్నవరం, రాజమండ్రి వంటి ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పిఠాపురం, అమలాపురం తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

  • Loading...

More Telugu News