: కొత్తగా వచ్చిన వారు నంద్యాలలో అటూ ఇటూ పరుగెత్తారు!: నవ్వులు పూయించిన చంద్రబాబు
ఎన్నికలు తమ పార్టీకి కొత్తేమీ కాదని, సిన్సియారిటీ ఉంటే ఏదైనా సాధ్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు నంద్యాలలో తమ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు ఎన్నికలు కొత్తేమీకాదని అన్నారు. కొత్తగా వచ్చిన వారు కొందరు మాత్రం అటూ ఇటూ పరిగెత్తారని, హడావుడి చేశారని నవ్వులు పూయించారు. చివరికి తామే గెలిచామని అన్నారు. నంద్యాలలో ఈ సారి జరిగినటువంటి రాజకీయాలు తాను ఎన్నడూ చూడలేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014లో ఓ మంచి తీర్పుని ఇచ్చారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధప్రదేశ్‌ని టీడీపీ మాత్రమే అభివృద్ధి చేయగలదని తమకు ఓట్లు వేశారని అన్నారు. అప్పట్లో ఏపీలో జగన్‌తో.. తెలంగాణలో టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపాలని చూసిందని, కుట్ర రాజకీయాలు చేసిందని విమర్శించారు. చివరకు తాము తీసుకున్న గోతిలోనే కాంగ్రెస్ పడిపోయిందని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అవకాశవాద రాజకీయాలు చేసినవారిని ప్రజలు ఓడించారని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి చనిపోతే తాను విజయమ్మకు ఆ సీటును వదిలేశానని చంద్రబాబు చెప్పారు. కానీ ఇక్కడ జగన్ అలా చేయలేదని అన్నారు. జగన్ మాట్లాడిన మాటలు, చేసుకున్న ప్రచారాన్ని ఓటర్లు గమనించారని అన్నారు. టీడీపీని జగన్ విమర్శించిన పద్ధతి ఆలిండియా స్థాయిలో చర్చనీయాంశం అయిందని అన్నారు. ఎన్నికల సమయంలో విమర్శలు మామూలే కానీ, హద్దులు దాటి నడిరోడ్డులో కాల్చి చంపాలంటూ, ఉరివేయాలంటూ మాట్లాడారని విమర్శించారు.