Sanju Samson: థర్డ్ అంపైర్ నిర్ణయంపై సంజూ శాంసన్ అసంతృప్తి.. భారీ జరిమానా విధింపు

  • మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం
  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడన్న బీసీసీఐ
  • వివాదాస్పదంగా మారిన ఢిల్లీ ఆటగాడు షాయ్ హోప్ అందుకున్న క్యాచ్
Sanju Samson fined heavily for act of dissent in IPL 2024 against Delhi Capitals

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు భారీ జరిమానా పడింది. గత రాత్రి (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందేహాత్మక క్యాచ్‌కు తనను ఔట్‌గా ప్రకటించడంతో థర్డ్ అంపైర్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణమైంది. రాజస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగవ బంతిని క్రీజులో ఉన్న సంజూ శాంసన్ భారీ షాట్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు షాయ్ హోప్ బౌండరీ లైన్‌ వద్ద పట్టిన ఈ క్యాచ్‌ వివాదానికి కారణమైంది. క్యాచ్ పట్టానంటూ హోప్ చెప్పినప్పటికీ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు అప్పగిస్తూ ఫీల్డ్ అంపైర్లు కేఎన్ అనంతపద్మనాభన్, ఉహాస్ గాంధే రిఫర్ చేశారు.

మూడు నాలుగు కెమెరా యాంగిల్స్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్‌ మైఖేల్ గోఫ్.. సంజూ శాంసన్ ఔట్‌గా తేల్చారు. ఈ నిర్ణయం పట్ల సంజూ శాంసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్ల వద్దకు వెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విధంగా వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుంది కాబట్టి సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించారు.
 
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం సంజూ శాంసన్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని, మ్యాచ్ రిఫరీ ముందు నేరాన్ని అంగీకరించాడని బీసీసీఐ ప్రకటన పేర్కొంది. లెవల్ 1 ఉల్లంఘనలకు సంబంధించి మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొంది.

కాగా సంజూ శాంసన్ ఔటవ్వడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News