: పవన్ కల్యాణ్ నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే!: మహేశ్ కత్తి డిమాండ్
సినీనటుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను చేసిన టార్చర్‌కి తనకు రెండు రోజుల పాటు నిద్ర పట్టలేదని సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి అన్నాడు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు ప్రతిరోజు ఫోన్ చేస్తూ, సోషల్ మీడియాలో తనపై పోస్టులు చేస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారని అన్నాడు. తాను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడినందుకు తనపై ఇలా ప్రవర్తిస్తున్నారని తెలిపాడు. అదే ఇంటర్వ్యూలో తాను డీజే సినిమా గురించి కూడా మాట్లాడానని, దాని గురించి మాత్రం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విమర్శలు చేయడం లేదని, ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి వీరికి విభేదాలు ఉన్నాయని అన్నాడు. మరోవైపు మెగా ఫ్యామిలీ జోలికి రావద్దని హెచ్చరిస్తున్నారని తెలిపాడు.
ఫ్యాన్స్ తనపై ప్రవర్తించిన తీరుకి పవన్ కల్యాణ్ తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మహేశ్ కత్తి డిమాండ్ చేశాడు. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పుకుంటూ, ఎక్కడో ఉండి ఒక్క ట్వీటు చేస్తున్నాడని ఎద్దేవా చేశాడు. ట్వీటు చేయడం ఘనకార్యమా? అని ప్రశ్నించాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తనకు క్షమాపణలు చెబుతున్నానని ట్వీటు చేయమనండి అని డిమాండ్ చేశాడు. పవన్ కల్యాణ్ సమాజానికి ఏం చేయబోడని అన్నారు. కనీసం తన పట్ల పవన్ ఫ్యాన్స్ ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నందుకు, తన కోసం కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయాలని అన్నాడు.