: నంద్యాలలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులు, కొడవళ్లతో దాడి చేశారు: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపణ
నిన్న ఉప ఎన్నిక జరిగిన నంద్యాలలో ఈ రోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. హోటల్ సూరజ్ గ్రాండ్ సమీపంలో మారణాయుధాలతో వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధుల అనుచరులు రెచ్చిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 'శిల్పా మోహన్ రెడ్డిని నరికేయండి' అంటూ అరుస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోయారని ఆరోపించారు. నాయకులకే ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్యులకు ఎటువంటి దుస్థితి ఉందో ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయుడు చేస్తోన్న దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రౌడీషీటర్‌కు గన్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలో ఆయుధాలను ఉండనివ్వకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఆయుధాలతో రెచ్చిపోవడమేంటని ప్రశ్నించారు. ఇష్టానుసారం టీడీపీ నేతలకు తుపాకుల లైసెన్సులు ఇచ్చారని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. దాడికి దిగిన మధుపై గతంలోనే రౌడీ షీట్ ఉందని అన్నారు.