: సీపీఆర్ఎల్ అవుట్ లెట్స్ తో మెక్ డొనాల్డ్స్ ఫ్రాంచైజీ అగ్రిమెంట్ రద్దు !
నార్త్, సౌత్ ఇండియాలో 169 ఫాస్ట్ ఫుడ్ అవుట్ లెట్స్ నిర్వహిస్తోన్న కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ లిమిటెడ్ (సీపీఆర్ఎల్) తో కొనసాగుతున్న ఫ్రాంచైజీస్ అగ్రిమెంట్ ను మెక్ డొనాల్డ్స్ ఇండియా రద్దు చేసింది. ఆయా అవుట్ లెట్స్ ఏ విషయంలోనూ తమ బ్రాండ్ ను ఉపయోగించని కారణంగా ఫ్రాంచైజీస్ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నామని మెక్ డొనాల్డ్స్ ఇండియా అధికారులు చెప్పారు. ఈ మేరకు సీపీఆర్ ఎల్ బోర్డుకు ఈ రోజు నోటీసు జారీ చేశామని, తమ మధ్య ఉన్న ఒప్పందాన్ని సీపీఆర్ఎల్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినప్పటికీ సీపీఆర్ఎల్ స్పందించలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో ఆయా అవుట్ లెట్స్ మూతపడనున్నాయి. కొన్ని వారాల క్రితం ఢిల్లీలోని సీపీఆర్ఎల్ కు చెందిన 43 అవుట్ లెట్స్ కు సంబంధించిన లైసెన్స్ లు రెన్యువల్ కాలేదు. ఈ నేపథ్యంలోనే మెక్ డొనాల్డ్స్ ఇండియా తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, సీపీఆర్ఎల్ ను విక్రమ్ భక్షీ నిర్వహిస్తున్నారు. సీపీఆర్ఎల్, మెక్ డొనాల్డ్స్ ఇండియా జాయింట్ వెంచర్ 50:50గా ఉంది. ప్రస్తుత నిర్ణయంతో 169 రెస్టారెంట్లు మెక్‌డొనాల్డ్స్ బ్రాండ్‌పేరును వినియోగించడాన్ని 15 రోజుల్లో నిలిపివేయాల్సి ఉంది. కొత్త భాగస్వామిని వెతుకులాడే పనిలో మెక్ డొనాల్డ్స్ ఇండియా ఉన్నట్టు తెలుస్తోంది.