: నాది నోరు పెద్దది, అక్కది బ్రెయిన్ పెద్దది!: భూమా మౌనిక
తనకు తండ్రి పోలిక, తన అక్కకు తల్లి పోలిక వచ్చాయని పార్టీ కార్యకర్తలు అంటుంటారని భూమా మౌనిక తెలిపారు. నంద్యాల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకోసం సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తామని తెలిపారు. పార్టీ కేడర్ ను కాపాడుకుంటామని, భూమా నాగిరెడ్డి ఏదైతే చేయాలని అనుకున్నారో వాటన్నింటినీ చేసి తీరుతామని అన్నారు.
తమది ఉమ్మడి కుటుంబమని, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చర్చించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తన అన్న బ్రహ్మానందరెడ్డి, అక్క అఖిల ప్రియతో కలిసి కాపాడుకుంటానని ఆమె చెప్పారు. తనకు నోరు పెద్దదని, తన అక్కకు బ్రెయిన్ పెద్దదని ఆమె చెప్పారు. అందుకే తామిద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. చుడీదార్ భారతీయతకు చిహ్నమన్న సంగతి రోజాకి తెలుసో లేదో తనకు తెలియదని ఆమె అన్నారు. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని రాజకీయాల్లో నిలబడే ధైర్యం ఉందని ఆమె తెలిపారు.