: ప్రియురాలి కోసం రూ.6.17 లక్షలు చోరీ చేసి.. కానుకలు కొన్న యువకుడు!
తన ప్రియురాలి కోసం రూ.6.17 లక్షలను చోరీ చేసి, ఆ డబ్బుతో ఖరీదైన ఆభరణాలు, వస్తువులు కొన్నాడో యువకుడు. అన్ని ఖర్చులూ పోగా అతడి వద్ద రూ.1.70 లక్షలు మిగిలాయి. తాజాగా ఆ ప్రేమికుడిని అరెస్టు చేసిన పోలీసులు మీడియా ముందు అతడిని ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన సంతోష్ అనే యువకుడు ఏ పనీ లేకుండా తిరుగుతుండేవాడు. దానికితోడు అతడికి ఓ ప్రేయసి కూడా ఉంది. ఆమెకు మర్చిపోలేని బహుమతులు ఇవ్వాలని అనుకున్నాడు.
ఈ క్రమంలో గుంటూరులోని ఓ లాడ్జిలో బస చేసిన మిర్చి రైతుకు చెందిన రూ.6.17 లక్షలను కాజేశాడు. ఆ రైతు నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అప్పటికే ఆ డబ్బుతో ఆ యువకుడు మూడు జతల బంగారు చెవి రింగులు, నక్లెస్, ఉంగరాలు, గొలుసు, వాచ్, స్మార్ట్‌ఫోన్, టీవీ, ఐదు జతల ఖరీదైన దుస్తులు కొన్నాడని పోలీసులు తెలుసుకొని షాకయ్యారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.