: ధోని సలహాలతోనే ఒత్తిడిని అధిగమించా: పాండ్యా
శ్రీలంక-భారత్ టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా విజయోత్సాహంలో ఉంది. ముఖ్యంగా, మూడో టెస్టు మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా శతకం సాధించి తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీ చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ప్రశాంతంగా ఉండేందుకు ధోనీ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నాడు. సెంచరీ సాధించే క్రమంలో 90 పరుగుల వద్ద తాను ఎలాంటి భావోద్వేగానికి, ఒత్తిడికి గురికాకపోవడానికి కారణం ధోనీయేనని చెప్పాడు.
జట్టును ఎప్పుడూ మెరుగైన స్థితిలో ఉంచాలనే విషయాన్ని ధోనీ నుంచి నేర్చుకున్నానని, స్కోర్ బోర్డు చూసి పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని ధోనీ సూచించిన విషయాన్ని ప్రస్తావించాడు. వ్యక్తిగత పరుగుల కోసం, గుర్తింపు కోసం ఆరాటపడనని చెప్పిన పాండ్యా, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సాధించిన రికార్డుల్లో పది శాతం తాను సాధించినా చాలని, తన జీవితాంతం ఆనందంగా గడిపేస్తానని అన్నాడు.