: ఆన్‌లైన్ మోసంతో రూ.2 కోట్లు నష్టపోయిన సీనియర్ సిటిజన్
ముంబైకి చెందిన 72 ఏళ్ల వ్యక్తి నుంచి ఆన్‌లైన్ మోసం ద్వారా దాదాపు రూ. 2 కోట్లను నైజీరియన్ ముఠా కాజేసింది. ఫేస్‌బుక్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్‌లో పెట్టుబడి పెడితే లాభాలు పొందవచ్చని మాయ మాటలు చెప్పి, రూ. 1.97 కోట్లను కాజేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నైజీరియన్ ముఠా మంబైలోని వివిధ బ్యాంకుల్లో నకిలీ పాన్ నెంబర్ ఉపయోగించి 108 అకౌంట్లను తెరచినట్లు విచారణలో తేలింది. ఈ అకౌంట్లన్నింటినీ పోలీసులు మూసివేయించారు. ఇక రూ. 2 కోట్ల విషయంలో ఢిల్లీకి చెందిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
వీళ్ల అకౌంట్ల నుంచి విత్‌డ్రా చేసిన రూ. 1.97 కోట్లను తిరిగి సీనియర్ సిటిజన్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అలాగే ముంబైలో నకిలీ పాన్‌కార్డులు తయారుచేసే నయా నగర్‌కు చెందిన వ్యక్తి మహ్మద్ ఆరిఫ్ షేక్‌ను కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ఆఫ్ఘనిస్థాన్‌లో కంపెనీలు పెడుతున్నామని, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు వస్తాయని ఫేస్‌బుక్ ద్వారా వ్యక్తులను ట్రాప్ చేసి పెద్దమొత్తంలో ఈ నైజీరియన్ ముఠా డబ్బు కాజేస్తోందని పోలీసులు పేర్కొన్నారు.