: రెండు రోజుల్లోనే జగన్ మళ్లీ నోరు జారాడు: దేవినేని ఉమా
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న తీవ్ర వ్యాఖ్యలు ఆయన నైజాన్ని తెలుపుతున్నాయని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ నీతి గురించి మాట్లాడడం ఏంటని అన్నారు. ఆవేదనలో ఉండే చంద్రబాబును కాల్చేయాలని వ్యాఖ్యలు చేశానని ఈసీకి వివరణ ఇచ్చిన జగన్, మళ్లీ రెండు రోజుల్లోనే నోరు జారాడని దేవినేని ఉమా అన్నారు.
జగన్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ క్రమశిక్షణగల పార్టీ అని, జగన్ లాంటి వారు రెచ్చగొట్టేలా ఎంతటి వ్యాఖ్యలు చేసినా తాము మాత్రం దిగజారబోమని తెలిపారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ఎద్దేవా చేశారు.