: దత్తత పిల్లల మధ్య పుట్టిన రోజు జరుపుకున్న హన్సిక!
బాలనటిగా బాలీవుడ్ లో అరంగేట్రం చేసి, హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చి, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న హన్సిక 'అమ్మ చెప్పిందే చేస్తా'నని చెబుతోంది. ఇప్పటి వరకు మొత్తం 32 మందిని దత్తత తీసుకున్న హన్సిక, తాజాగా తన పుట్టిన రోజు వేడుకను తాను దత్తత తీసుకున్న పిల్లల మధ్య జరుపుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పుట్టిన రోజును పిల్లల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. పుట్టినరోజు సందర్భంగా తనకు వచ్చిన బహుమతులను పిల్లలకు పంచడంలో ఉన్న ఆనందమే వేరని తెలిపింది. ఇతరులకు సాయం చేయటం, మంచి ప్రవర్తనతో మెలగడం తన తల్లి చిన్నతనం నుంచే నేర్పారని, ఆమె చెప్పిన మాటే తన బాట అని హన్సిక తెలిపింది. కాగా, కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు ఆమెకు సోషల్ మీడియా మాధ్యమంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.