: జియోకు షాకిచ్చిన జేపీ మోర్గాన్ సంస్థ నివేదిక!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్ లోని టెలికాం వ్యాపారులకు షాక్ ఇస్తూ జియోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఊహించని రీతిలో భారత్ టెలికాం రంగంలో జియో పెను ప్రకంపనలు రేపింది. జియో రాకతో ఇతర టెలికాం సంస్థలన్నీ ఊహించని నష్టాల్లో కూరుకుపోయాయి. వాటి నుంచి బయటపడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇంతలోనే తాజాగా జరిగిన సర్వసభ్య సమావేశంలో 4జీ ఫీచర్ ఫోన్ ను కేవలం 1500 రూపాయలకు అందుబాటులోకి తెస్తున్నామని, మూడేళ్ల తరువాత ఆ ఫోన్ కు చెల్లించిన డిపాజిట్ ను వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఆఫర్ లో మూడేళ్ల లాకింగ్ పీరియడ్ ప్రతిబంధకంగా మారనుందని న్యూయార్క్ కు చెందిన బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ సంచలన నివేదిక బయటపెట్టింది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా జియో లేదని తెలిపింది. మూడేళ్లు ఖాతాదారులను తన నెట్ వర్క్ మాత్రమే వాడేలా రిలయన్స్ వేసిన ఎత్తుగడ వారిని ఆ ఫోన్ కి దూరం చేసే అవకాశం ఉందని చెప్పింది. జియో ఫీచర్ ఫోన్ తోపాటు నెలకు 153 రూపాయలు రీఛార్జ్ చేసుకుని అన్ని సేవలు పొందవచ్చని జియో పేర్కొందని జేపీ మోర్గాన్ గుర్తుచేసింది.
నెలకు 153 రూపాయల రీఛార్జ్ చేసుకోగల స్తోమత ఉన్నప్పుడు మూడేళ్ల పాటు జియోను అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. అదే సమయంలో మూడేళ్లలో ఎన్నో కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మూడేళ్ల పాటు కస్టమర్లను అట్టిపెట్టుకుంటామన్న జియో ప్లాన్ విజయం సాధించడం కష్టమని చెప్పింది. అదే సమయంలో ప్రత్యర్థులు ఇతర ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకుని బండిల్ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది.