: దుమ్ము దులపాల్సిందే... ఆట మొదలైంది: శిల్పా చక్రపాణి రెడ్డి
నంద్యాల ఎన్నికల్లో దుమ్ము దులపాల్సిందేనని, ఇక తమ ఆట మొదలైందని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాలతో జరుగుతున్న వైసీసీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టి పట్టుమని 90 రోజులు కాలేదు, కానీ జగన్ అడిగినట్లుగానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీ నైతిక విలువలు కాపాడింది తానేనని శిల్పా చక్రపాణి పేర్కొన్నారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వాళ్లు కూడా తమ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆయన సవాల్ విసిరారు.
ప్రస్తుతం `భూమా... డ్రామా` అనే కొత్త సినిమా ప్రారంభమైందని, తల్లిదండ్రుల ఫొటోలు పెట్టుకుని వాళ్లు ఓట్లు అడుక్కుంటున్నారని శిల్పా చక్రపాణి ఎద్దేవా చేశారు. వాళ్లు ఎన్ని గిమ్మిక్కులు చేసినా చివరికి ఓట్లు పడేది తమకేనని, అన్ని మతాలు, కులాల ఓట్లు తమకే అని ఆయన తెలిపారు. జనమే తమకు దేవుళ్లని, వాళ్లేం తెలివి తక్కువ వాళ్లు కాదని, ఎవరికి ఓట్లు వేయాలో వాళ్లకి బాగా తెలుసని శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేశారు.