: మాహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదే, నంద్యాల నియోజకవర్గం ఎప్పుడూ వైసీపీదే!: రోజా
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్టేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నంద్యాలలో జరుగుతున్న వైసీపీ భారీ బహిరంగ సభలో రోజా మాట్లాడుతూ, మాహిష్మతి సామ్రాజ్యం ఎప్పుడూ బాహుబలిదేనని, అలాగే నంద్యాల నియోజకవర్గం ఎప్పుడూ వైసీపీదే అని ఆమె అన్నారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు అని, నల్లకాలువ సాక్షిగా మీ వెంటే ఉంటానని నాడు ఇచ్చిన హామీ ప్రకారం జగన్ మన వెంటే ఉన్నాడని అన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా లెక్క చేయలేదని, ఈ ఉప ఎన్నిక రావడానికి కారణం చంద్రబాబేనని, 21 మంది ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారని, నంద్యాల దెబ్బ చంద్రబాబుకు అబ్బా అనేలా ఉండాలని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నంద్యాల.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడ్డా’ అని, నంద్యాల అభివృద్ది వైఎస్సార్ హయాంలోనే జరిగిందని రోజా అన్నారు.