: షేవింగ్ క్రీమ్ బాగాలేదని షారూఖ్, కంపెనీ, షాపు యజమాని, ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్ మెంట్ కు నోటీసులు!
ఎండార్స్ మెంట్లు చేజిక్కించుకోవడంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను మించినవారు లేరంటే అతిశయోక్తికాదు. దుస్తులు, డ్రింకులు, క్రీములు, ఈకామర్స్ వెబ్ సైట్లు, షాపూలు, షేవింగ్ క్రీములు, హెల్త్ డ్రింక్స్ ఇలా విభాగం ఏదైనా షారూఖ్ ఖాన్ యాడ్ లో ఉండాల్సిందే. అలాగే షారూఖ్ ఖాన్ ను బాగా అభిమానించే మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్ కుమార్ పాండే అనే వ్యక్తి టీవీలో ప్రసారమయ్యే యాడ్ ను చూసి షేవింగ్ క్రీమును కొనుక్కుని వాడారు. అయితే షారూఖ్ ఆ యాడ్ లో చెప్పినట్టు ఇండియా నంబర్ వన్ షేవింగ్ క్రీమ్ నే అతను కొనుగోలు చేసి వాడడం ప్రారంభించాడు.
అయితే ఆ షేవింగ్ క్రీమ్ వాడడం వల్ల అతని ముఖంపై రాషెస్ వచ్చాయి. దీంతో ఆయన ప్రభుత్వాసుపత్రిలో ముఖంపై ఏర్పడ్డ మచ్చలకు చికిత్స తీసుకుంటున్నారు. దీనిపై ఆగ్రహానికి గురైన ఆయన షారుక్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. అతని వాదనలన్నీ విన్న న్యాయస్థానం షారూఖ్ ఖాన్, ఈ షేవింగ్ క్రీమ్ ను తయారు చేసిన సంస్థ యజమానికి, ఈ షేవింగ్ క్రీమ్ ను అమ్మిన షాపు యజమానికి, మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్ మెంట్ కు నోటీసులు జారీ చేసింది.