: నరేంద్ర మోదీ టీమ్ లోకి అన్నాడీఎంకే... 4న నిర్ణయం!
1998 నుంచి 1999 వరకు, ఆపై 2004 నుంచి 2006 వరకూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే, మరోసారి అదే గొడుగు కిందకు చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతు పలకాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీల్లోని అత్యధికులు అభిప్రాయపడుతుండగా, ఈ నెల 4న జరిగే పార్టీ సమావేశం తరువాత దీనిపై ఓ ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో 50 మంది ఎంపీలతో బీజేపీ, కాంగ్రెస్ ల తరువాత అతిపెద్ద పార్టీగా అన్నాడీఎంకే కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నెలాఖరులోగా నిర్ణయం వెలువడుతుందని పళని స్వామి ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి వెల్లడించారు. ఈ విషయంలో ఇప్పటివరకూ తాము నిర్ణయం తీసుకోలేదని, శుక్రవారం నాడు చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన తెలిపారు. కాగా, 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీ వ్యూహంలో భాగంగానే అన్నాడీఎంకేను ఆ పార్టీ ఆహ్వానిస్తోందని గతంలోనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేను ఎన్డీయే గొడుగు కిందకు చేర్చే బాధ్యతలను ఓ సీనియర్ బీజేపీ నేతకు మోదీ, అమిత్ షాలు అప్పగించినట్టు తెలుస్తోంది.