: నంద్యాల టీడీపీకి పెను షాక్... వైసీపీలోకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా!
నంద్యాల ఉప ఎన్నికల పోరు మరింత రసవత్తరం కానుంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగగా, ఆయన సోదరుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. నేటి మధ్యాహ్నం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై వారితో చర్చించిన తరువాత, ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కాగా, చక్రపాణిరెడ్డిని ఆపేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపీ సీఎం రమేష్ ను రంగంలోకి దించగా, పార్టీని వీడవద్దని ఆయన బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ప్రకటించిన తరువాత, శిల్పా మోహన్ రెడ్డి చకచకా పావులు కదిపి, వైకాపాలో చేరిపోయిన సంగతి తెలిసిందే. తన అన్నను ఆపడంలో విఫలమయ్యారని పలువురు తెలుగుదేశం నేతలు శిల్పా చక్రపాణిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు కూడా. ఇక ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆయన్ను పక్కన పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలి చంద్రబాబు నంద్యాల పర్యటనలోనూ చక్రపాణి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించారు. ఈ నెల 3వ తేదీన నంద్యాల పర్యటనకు వైఎస్ జగన్ రానుండగా, ఆ సమయంలోనే వైకాపా కండువా పుచ్చుకునేందుకు చక్రపాణి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.