: అల్లరి మూకల ట్వీట్లకు అదే స్థాయిలో సమాధానమిచ్చిన గుత్తా జ్వాల
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలపై కొందరు అల్లరి మూకలు చేసిన కామెంట్లకు... ఆమె కూడా అదే స్థాయిలో స్పందించింది. వివరాల్లోకి వెళ్తే, గుత్తా జ్వాల తల్లిది చైనా. ఆమె టియాన్ జిన్ లో జన్మించారు. ఈ నేపథ్యంలో, కొందరు పనిగట్టుకుని జ్వాలపై విమర్శలు గుప్పించారు. ఆమెను దేశద్రోహిగా అభివర్ణించారు. మీ అమ్మది చైనా కావడంతోనే నీవు ప్రతిసారి మోదీని వ్యతిరేకిస్తున్నావా? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా, తన తల్లిదండ్రులను సంభాషణలోకి లాగితే, తనలో ఉన్న మరో కోణాన్ని చూడాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పింది.
క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అంశాన్ని మరో నెటిజన్ లేవనెత్తాడు. దీంతో ఆ వ్యక్తిపై జ్వాల విరుచుకుపడింది. దమ్ముంటే తను ముందుకు వచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరింది. అజార్ ప్రమేయం వల్లే గుత్తా జ్వాల వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చినట్టు గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.