: ఉద్ధానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ బృందం పరిశోధన... పవన్ కల్యాణ్ కృషికి ఫలితం!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృషి వల్ల శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంత కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచి రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాలను పరిశోధించడానికి హార్వర్డ్ శాస్త్రవేత్తల బృందం విచ్చేసింది. దశాబ్దకాలంగా ఉద్ధానంలోని ఏడు మండలాల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వీటి వెనక అసలు కారణం మాత్రం ఇంతవరకు ఎవరికి అంతుపట్టలేదు.
మూడు రోజుల పాటు హార్వర్డ్ బృందం విశాఖపట్నం, ఇచ్చాపురం, ఉద్ధానం ప్రాంతాల్లో పరిశోధన చేయనున్నారు. వీరికి తోడుగా ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యులు వుంటారు. పరిశోధనలో తేలిన విషయాల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో శాస్త్రవేత్తల బృందం చర్చించనున్నట్లు సమాచారం.