: ఎంతో మంది సెలబ్రిటీల్లో నోటీసులిచ్చింది కేవలం 12 మందికే: తలసాని
టాలీవుడ్ లో డ్రగ్ వివాదంపై సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో డ్రగ్ వివాదంపై కొంత మంది గోడమీద పిల్లుల్లా మాట్లాడుతున్నారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉండగా, కేవలం 12 మందికి మాత్రమే సిట్ అధికారులు నోటీసులిచ్చారని గుర్తుచేశారు. 12 మందికి మాత్రమే నోటీసులిస్తే మొత్తం సినీ పరిశ్రమ మొత్తాన్ని ఏదో చేసేస్తున్నారన్నట్టు కొంత మంది మాట్లాడడం సరికాదని అన్నారు. డ్రగ్ వివాదం కారణంగా సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి తరలిపోతుందంటూ పుకార్లు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాదులాంటి వాతావరణం దేశంలో మరెక్కాడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. నోటీసులు అందుకున్న ఆ 12 మంది సినీ సెలబ్రిటీలను నేరస్తులనో లేక ముద్దాయిలనో ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదు నుంచి డ్రగ్స్ ను తరమికొట్టాల్సిన అవసరం ఉందని, అందుకు తగ్గ ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆయన వివరణ ఇచ్చారు. వివాదం కోసం మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.