: ఉగ్రవాదులకు ఏటీఎంలుగా మారిన హురియత్ కార్యాలయాలు... డబ్బుల కోసం వేర్పాటు వాదులకు బెదిరింపులు!
జమ్ముకశ్మీర్‌లోని హురియత్ నేత కార్యాలయాలు ఉగ్రవాదులకు ఏటీఎంలుగా మారాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులిచ్చే యంత్రాలుగా తయారయ్యాయా? అవునేనే అంటున్నాయి తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చిక్కిన లేఖలు. ఎన్ఐఏ అధికారుల సోదాల్లో ఉగ్రవాద సంస్థలైన హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా లెటర్ హెడ్స్‌తో ఉన్న లేఖలు లభ్యమయ్యాయి. ఉగ్రవాదులకు రెండు మార్గాల ద్వారా కశ్మీర్ నుంచి నిధులు అందుతున్నట్టు ఈ లేఖల ద్వారా వెల్లడైంది. మొబైల్ ఫోన్ల నుంచి వేలాది రూపాయల వరకు వేర్పాటు వాదుల నుంచే వారికి అందుతున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు ఎన్ఐఏ అదుపులో ఉన్న పలువురు హురియత్ నేతలు కశ్మీర్‌లో కల్లోలానికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల నుంచి కూడా నిధులు అందుతున్నట్టు తెలిపారు.
కాగా, ఎన్ఐఏ అధికారులకు చిక్కిన లేఖల్లో తెహ్రీక్-ఇ-హురియత్ చీఫ్ సయ్యద్ అలీ షా గిలానీకి అత్యంత సన్నిహితుడైన అక్బర్ ఖండీకి మొహమ్మద్ అమీన్ బట్ అనే ఉగ్రవాది రాసిన లేఖ కూడా ఉంది. తనకు అర్జెంటుగా రూ.5 లక్షలు కావాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘ది జమ్ము అండ్ కశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్’ అనే లెటర్‌హెడ్‌పై ఈ లేఖను రాశాడు. నోట్ల రద్దు కారణంగా ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటుండడంతో తమకు అర్జెంటుగా రూ.5లక్షలు కావాలని అందులో డిమాండ్ చేశాడు. అంతేకాదు నాలుగు రోజుల్లోనే సర్దుబాటు చేయాలని హుకుం కూడా జారీ చేశాడు. లేదంటే ఖండీ కుటుంబ సభ్యులు ప్రమాదం లో పడతారని హెచ్చరికలు కూడా చేయడం విశేషం. ఎన్ఐఏ అధికారులు సోమవారం అరెస్ట్ చేసిన ఏడుగురు వేర్పాటు వాదుల్లో ఖండీ కూడా ఉన్నాడు.
ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న లేఖల్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఏరియా కమాండర్ బుర్కాన్ మార్చి 17న రాసిన లేఖ కూడా ఉంది. షబీర్ షా అనుచరుడు నయీమ్ ఖాన్‌కు రాసిన ఆ లేఖలో తనకు రూ.10 వేలు, మొబైల్ ఫోన్ కావాలని కోరాడు. మరో లేఖ లష్కరే తాయిబా ఉగ్రవాదులు రాసినది. సహచరులకు ఆరోగ్యం బాగాలేదని, అర్జెంటుగా రూ.5 వేలు పంపాలని, తమను నిరాశపరచరని భావిస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఇలాంటివే మరికొన్ని లేఖలు ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ వేర్పాటువాదులకు రాసినవి కావడం గమనార్హం. వీటిని విశ్లేషించిన అధికారులు ఉగ్రవాదులకు హురియత్ కార్యాలయాలు ఏటీఎంలుగా మారాయని గుర్తించారు.