: 4జీ స్పీడులో జియో కన్నా ఎయిర్‌టెల్ మిన్న!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చెప్పినట్లుగా అత్యంత 4జీ ఇంటర్నెట్ స్పీడు అందిస్తున్న నెట్‌వర్క్ జియో కాదని ఎయిర్‌టెల్ వారి 4జీ వేగం జియో కంటే మెరుగ్గా ఉందని బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ టెస్టింగ్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ తెలిపింది. 4జీ స్పీడును అంచనా వేయడంలో ట్రాయ్ ఉపయోగించిన విధానాల్లో లోపం ఉందని బ్రిటన్‌కు చెందిన ఓపెన్ సిగ్నల్ ఆరోపించింది. తాము కొత్తగా ప్రవేశ పెట్టిన యావరేజ్ పీక్ స్పీడ్ కొలమానం ద్వారా ఎయిర్‌టెల్ చాలా ఎక్కువ 4జీ వేగాన్ని అందిస్తోందని తెలియజేసింది.
ఎయిర్‌టెల్ యావరేజ్ పీక్ స్పీడ్ 56.6 ఎంబీపీఎస్ ఉండగా రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ది 50 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లు ఓపెన్ సిగ్నల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. ట్రాయ్ వారు మైస్పీడ్ యాప్ ద్వారా వినియోగదారుల అభిప్రాయం మేరకు ఆదర్శ పరిస్థితుల్లో 4జీ వేగాన్ని అంచనా వేస్తున్నారు. ఓపెన్ సిగ్నల్ వారు మాత్రం ప్రతిరోజు 4జీ స్పీడ్ వివరాలను వినియోగదారుల నుంచి సేకరించి, వాటి ద్వారా యావరేజ్ పీక్ స్పీడ్‌ను లెక్కగడుతున్నారు. 4జీ వేగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి యావరేజ్ పీక్ స్పీడ్ విధానమే సరైనదని ఓపెన్ సిగ్నల్ అభిప్రాయపడుతోంది.