: విద్యార్థులకు ఫ్రీ వై-ఫై... పరిశీలిస్తున్న రిలయన్స్ జియో!
భారతదేశంలో టెలికాం రంగంలో రిలయన్స్ జియో తీసుకువచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ స్మార్ట్ సేవలు అందుతున్నాయంటే అది జియో పుణ్యమే. త్వరలో 4జీ ఫీచర్ ఫోన్ ను ఉచితంగా అందజేసే బృహత్తర కార్యక్రమానికి జియో సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే త్వరలో దేశంలో ఉన్న 3 కోట్ల మంది కళాశాల విద్యార్థులకు ఫ్రీ వై-ఫై సేవలు అందజేసే యోచనలో రిలయన్స్ జియో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ప్రభుత్వ అనుమతి కోరుతూ మానవ వనరుల శాఖకు రిలయన్స్ వారు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా వై-ఫై కనెక్టివిటీ ద్వారా 38,000 కళాశాలలను అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మానవ వనరుల శాఖకు ఎలాంటి వ్యయం లేకున్నా మిగతా టెలికాం ఆపరేటర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ టెండర్‌పై పారదర్శకంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.