: డ్రగ్స్ కేసులో నాకు కూడా నోటీసులు రావచ్చు.. వస్తే వెళతా!: రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్‌ని కుదిపేస్తోన్న డ్రగ్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ప్రతి మనిషికి నోరు ఉంటుందని, ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారని తాను కూడా తన అభిప్రాయాలను చెబుతూ ఉంటానని అన్నారు. ఒకవేళ తనకు నోటీసులు వచ్చినా తాను వెళ్లి అధికారుల ముందు కూర్చోవాల్సిందేనని, తనకు కూడా నోటీసులు రావచ్చని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, ఒకవేళ నోటీసులు వస్తే మాత్రం విచారణ మాత్రం ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. తాను ఎన్నో అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటానని, తాను చెప్పేది ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా తనకు నష్టం ఉండబోదని అన్నారు.
విచారణలో తానయినా, ఎవరయినా తప్పు చేసినట్లు తేలితే మాత్రం శిక్ష పడుతుందని వర్మ అన్నారు. అప్పుడే ఆ వ్యక్తిని తప్పుచేసిన వాడిగా చూడాలని వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎక్సైజ్ శాఖ అధికారులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నామని మాట్లాడుతున్నారని, ఒకే ఒక్క వ్యక్తి తన అభిప్రాయం చెప్పినంత మాత్రాన అంతపెద్ద పోలీస్ వ్యవస్థ ఆత్మస్థైర్యం కోల్పోతుందా? అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ చేసేది తనకు నచ్చదని చెప్పే హక్కు కూడా తనకు ఉందని అన్నారు. తమ ఇంట్లో కూడా డ్రగ్స్ ఉండొచ్చని, తమ ఇంట్లో పనివాడు కూడా వాడుతుండొచ్చని, ఆ విషయం గురించి తనకు తెలిస్తేనే తన స్పందన ఉంటుందని అన్నారు. తన వద్ద పనిచేసిన సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కుంటున్నారని, తాను మాత్రం వారు డ్రగ్స్ తీసుకుంటుండగా ఎప్పుడూ చూడలేదని అన్నారు. తనకు అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని వ్యాఖ్యానించారు.
డ్రగ్స్‌ను ఎవ్వరూ బహిరంగంగా తీసుకోరు కదా? అని వర్మ ప్రశ్నించారు. షాపుల్లో అందరికీ కనిపించేలా పెట్టరుకదా? అని అడిగారు. ఎవరినీ చిన్న మాట కూడా అనకుండా ఉండాలంటే ఎలాగ? అని వర్మ అన్నారు. తాను ఎటువంటి దుర్భాష వాడకుండా అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని అన్నారు. ‘ఒక రామ్ గోపాల్ వర్మ వంటి వాడు ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో పట్టించుకోవాల్సిన అవసరం కూడా అధికారులకు లేదు’ అని వ్యాఖ్యానించారు. చట్టాల గురించి, సెక్షన్ల గురించి తనకు అంతగా తెలియదని, ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాన్ని తెలిపే హక్కు ఉందని తనకు తెలుసని వర్మ వ్యాఖ్యలు చేశారు.