: బెల్ట్ షాపులు పెట్టొద్దని మర్యాదగా చెప్పా, వినకపోవడంతో బెల్ట్ తీస్తున్నా: సీఎం చంద్రబాబు
బెల్ట్ షాపులు పెట్టొద్దని మర్యాదగా చెప్పానని, ఆ మాట వినకపోవడంతో బెల్ట్ తీస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో టౌన్ బ్యాంక్ భవనం, మోడల్ పోలీస్ స్టేషన్ భవనం, పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నప్పటికీ, తమపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తున్నారని, తమను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానని అన్నారు. కులాలు, మతాల పేరుతో కొందరు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని అన్నారు.
పేద పిల్లల చదువుల కోసం సహకారం అందిస్తామని, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పక్కా ఇళ్ల మంజూరుకు ఎవరైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని, అవినీతికి ఎవరైనా పాల్పడితే 1100 నెంబర్ కు ఫోన్ చేయాలని ప్రజలకు తెలిపారు. అక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఇసుక నుంచి వచ్చే ఆదాయాన్ని వదులుకున్నామని అన్నారు. సెప్టెంబర్ లోపు హంద్రీనీవా నీటిని కుప్పంకు తీసుకువస్తానని, వంద శాతం సబ్సిడీపై డ్రిప్, మొబైల్ స్ప్రింకర్లు అందజేస్తున్నామని అన్నారు.
14 ఎకరాల 50 సెంట్లను మార్కెట్ కమిటీకి ఇస్తామని, అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతాయని, పంటలతో పాటు పట్టు పరిశ్రమ, డెయిరీకి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. టీడీపీ నీతిమంతమైన పార్టీ అని, పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు.
కాగా, కుప్పంలో ఏకేఆర్ టెక్స్ టైల్స్, వైష్ణవి మెగా ఫుడ్ వర్క్, నవ క్వాలిటీ ఫుడ్స్ పరిశ్రమకు, మెడికల్ కాలేజీ సమీపంలో అగ్నిమాపక కేంద్రానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు.