: క్యాబ్ బుక్ చెయ్... పెళ్లి సంబంధం పట్టేయ్!
క్యాబ్ బుక్ చేస్తే పెళ్లి సంబంధం ఎలా దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? పాకిస్థాన్‌లో ఇప్పుడు ఇదే ట్రెండు మరి! అక్కడి క్యాబ్ సర్వీస్ యాప్ `కారీం` వారు చేసిన మార్కెటింగ్ మ్యాజిక్ ఇది. ఈ ఆఫర్ ద్వారా వారు ఒక రిష్తా ఆంటీని (పెళ్లిళ్ల పేరమ్మ) క్యాబ్‌లో ముందే కూర్చోబెడతారు. ఎవరైనా క్యాబ్ బుక్ చేసి, ఎక్కగానే పక్కన కంపెనీగా రిష్తా ఆంటీ ఉంటుంది. ఎక్కిన వారు బ్యాచిలర్ అయితే వ్యక్తిగత వివరాలతో పాటు, అభిరుచులు, ఎలాంటి భాగస్వామి కావాలనుకుంటున్నారు? వంటి వివరాలను సేకరిస్తుంది.
ఇలా అందరి దగ్గర సేకరించి సరైన జంట అనుకున్న వారికి తర్వాత మెసేజ్ పంపిస్తుంది. ఈ ఆఫర్ రెండు రోజులు మాత్రమే కొనసాగింది. ఇలా మార్కెటింగ్ కోసం కారీం వారు చేసిన ప్రయత్నాన్ని సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు పాకిస్థానీ నెటిజన్లు. `ఇది ట్రావెలింగ్ సర్వీస్ యాపా? లేక డేటింగ్ సర్వీస్ యాపా?`, `మార్కెటింగ్ కోసం ఇంతకు దిగజారుతారా?` అంటూ కామెంట్లు చేశారు.