: అపోలోలో జయలలితకు సేవలందించిన నర్సు ఆత్మహత్యాయత్నం!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందించిన నర్సు గ్లోరియా ఆత్మహత్యాయత్నం చేసింది. జయకు అపోలో అసుపత్రిలో చికిత్స అందించిన గ్లోరియా చైన్నైలోని ఐనావరం నగేశ్వర గురుస్వామి వీధిలో నివసిస్తోంది. ఆమె భర్త విజయకుమార్ అదే ప్రాంతంలో ఓ స్టేషనరీ దుకాణాన్ని నడుపుతుండేవాడు. ఆమెకు కుమారులు ప్రవీణ్ (7), సుజిత్ (6) ఉన్నారు.
గ్లోరియా భర్త నాలుగు నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఈ పరిస్థితిలోనే ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కుమారులకు నిద్రమాత్రలు మింగించి, ఆమె కూడా నిద్ర మాత్రలు వేసుకుంది. స్పృహ కోల్పోయిన వీరిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, గ్లోరియా ఆత్మహత్యాయత్నానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆమె ఇంటిలో 100కు పైగా నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు.