: వెంకయ్య నామినేషన్ ఘట్టం పూర్తి!
ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి పదవికి ముప్పవరపు వెంకయ్యనాయుడు కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలతో పాటు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన పలువురు నేతలు వెంటరాగా వెంకయ్య రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, వచ్చే నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో వెంకయ్య గెలుపు సునాయాసమేనని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.