: కుండపోత వర్షాలతో తెలుగు జీవనం అతలాకుతలం... పలు చోట్ల ఆగిన రైళ్లు... రంగంలోకి ఎమర్జెన్సీ టీములు!


నిన్న మధ్యాహ్నం నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజల దైనందిన జీవనం అతలాకుతలమైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ సహా పలు పట్టణాలు, నగరాల్లోని పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది.  వందలాది గ్రామాలు బురదమయమయ్యాయి. రాత్రంతా వర్షాలు కురుస్తూనే ఉండటంతో, పలు చోట్ల రైలు పట్టాలపైకి నీరు చేరగా, కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ద్రోణి కలిసి రావడంతోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

నాగావళి నదికి భారీ వరద వచ్చి రైల్వే బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. రాయగడ్ - టిట్లాగర్ మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వీటి పునరుద్ధరణకు మరో రోజు పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. తూర్పు కోస్తా జీఎం సహా ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రజల సౌకర్యార్థం విశాఖ, రాయగడ్ మధ్య ప్రత్యేక ప్యాసింజర్ రైలును తిప్పుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ మధ్య రైల్వే ట్రాక్ బలహీనంగా ఉందన్న అనుమానంతో పలు రైళ్లను నిదానంగా నడిపిస్తున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములను రంగంలోకి దించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు, నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News