: హిల్లరీ అధ్యక్షురాలిగా ఉండాలని పుతిన్ కోరుకుంటాడు: ట్రంప్
జీ20 సమావేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసొచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు మొదటిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకంటే హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఉంటే కనుక పుతిన్ బాగా సంతోషించేవాడని, పుతిన్‌కు తనంటే అస్సలు ఇష్టం లేదని ఆయన తెలిపారు. ప్రచారంలో రష్యా పేరు వాడుకుని అధ్యక్షుడయ్యాడని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
`నేను అధ్యక్షుడయ్యాక చేసిన ఒక్క పని కూడా రష్యాకు అనుకూలంగా లేదు. అదే హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలై ఉంటే నేను చేసిన పనులకు వ్యతిరేకంగా చేసేది. అప్పుడు వ్యవహారాలన్ని పుతిన్‌కు అనుకూలంగా సాగేవి` అంటూ కొన్ని పనులను ఉదహరించారు ట్రంప్. తాను చేసిన మిలటరీ సంస్కరణలు, ఇంధన సంస్కరణలను పుతిన్ ఎంత మాత్రం మెచ్చుకోరని, అదే హిల్లరీ అయితే ఇందుకు వ్యతిరేకంగా చేసి పుతిన్ మెప్పు పొందేవారని ట్రంప్ అన్నారు.
అలాగే జీ20 వద్ద పుతిన్‌తో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ - `మా ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా చర్చలు కొనసాగాయి. అందరూ ఏదో జరగబోతుందని భయపడ్డారు. కాకపోతే ఆ రెండు గంటలపాటు మేం సానుకూల విషయాలే మాట్లాడుకున్నాం. అణుశక్తి పరంగా బలంగా ఉన్న రెండు గొప్ప దేశాల అధినేతలు మాట్లాడుకుంటే అది చెడు కోసమే అని ఎందుకనుకంటారో నాకు అర్థం కాదు` అంటూ చమత్కరించారు.