: జగన్ మాటలకు అర్థం అది కాదు: ఎమ్మెల్యే రోజా
ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలనేది తన బలమైన కోరిక అని ఇటీవల గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత జగన్ పేర్కొనడం, ఆ వెంటనే ఈ వ్యాఖ్యలపై అధికారపక్షం నేతలు తీవ్ర విమర్శలు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ.. జగన్ మాటలకు అర్థం ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేయాలనుందని కాదు.. ముప్పై ఏళ్లు గుర్తుంచుకునేలా పరిపాలన ఇస్తానని అర్థం చేసుకోవాలని అన్నారు.
నిజంగా ఆయన పరిపాలన బాగుంటే ముప్పై ఏళ్లు ఏంటీ, నలభై ఏళ్లయినా ప్రజలు ఆయన్ని గెలిపించుకుంటూ పోతారని, ఎందుకంటే, చాలా రాష్ట్రాల్లో ఇరవై ఏళ్లు,ఇరవై ఐదేళ్లు ఒకే పార్టీ అధికారంలో ఉన్నది మనం చూశామని చెప్పారు. అంటే, మనం చేసే పనులు రాష్ట్రాభివృద్ధికి, ప్రజల కష్టాలు దూరం చేసే విధంగా ఉంటే ప్రజలు ఆశీర్వదిస్తారని రోజా అన్నారు. 2019 నాటికి ఏపీ బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు, ఆ తర్వాత ఐదేళ్లకు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని.. అప్పుడు జగన్ ప్రకటించిన 9 పథకాలు అమలు చేస్తామని అన్నారు. అయితే, రోజా చేసిన ఈ ప్రకటనతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.