: భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని హత్య చేస్తే, నిర్దోషిగా ప్రకటించిన అబుదాబీ కోర్టు... ఇద్దరి భార్యలకూ మాత్రం శిక్ష!
నమ్మిన స్నేహితుడే ద్రోహం చేయగా, చూసి తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి అతన్ని దారుణంగా హత్య చేస్తే, కోర్టు మాత్రం అతనిని నిర్దోషిగా ప్రకటించి వదిలేసింది. అబుదాబీ నగరంలో జరిగిన ఈ ఆసక్తికర కేసు విషయాల్లోకి వెళితే, పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి, మరో వ్యక్తితో కలసి 15 సంవత్సరాలుగా అబూదాబీలో ఉంటూ, ఓ రెస్టారెంటును, మరో ట్రాన్స్ పోర్టు కంపెనీని నడుపుతూ, ఫిలిప్పైన్స్ కు చెందిన యువతులను వివాహం చేసుకుని, ఒకే ఇంట్లో కలసి మెలసి ఉంటున్నారు.
ఈ క్రమంలో స్నేహితుడి సెల్ ఫోన్ ను మరో మిత్రుడు పరిశీలించగా, తన భార్యతో అతను కలిసున్న వీడియోలు కనిపించాయి. దీంతో తీవ్ర కోపంతో పదునైన కత్తితో దాడి చేసి అతనిని హత్య చేశాడు. ఆపై తాపీగా పోలీసులకు విషయాన్ని చెప్పాడు. ఇక విచారణ జరిపిన పోలీసులు, తమకు తెలిసిన విషయాలను కోర్టు ముందుంచారు. హతుడి భార్యే ఈ వీడియోలు తీసిందని, వారి ముగ్గురికీ ఇందులో పాత్ర వుందని తేల్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, తనకు జరిగిన అన్యాయానికి తీవ్రమైన ప్రతీకారంతోనే నిందితుడు హత్య చేశాడని అతనిని సమర్ధిస్తూ, నిర్దోషిగా విడుదల చేసింది. ఇద్దరి భార్యలకూ మాత్రం మూడేళ్ల జైలు శిక్షను విధించింది.