: ప్రధాని డ్రెస్సింగ్ స్టైల్ ది బెస్ట్: ఫ్యాషన్ డిజైనర్ పెర్నియా ఖురేషీ
భారత రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్రమోదీ డ్రెస్సింగ్ స్టైల్ 'ది బెస్ట్' అని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పెర్నియా ఖురేషీ అన్నారు. హైదరాబాద్‌లో యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మోదీతో పాటు ప్రఫుల్ పటేల్, ఒమర్ అబ్దుల్లా, హేమా మాలిని వంటి రాజకీయ నాయకుల డ్రెస్సింగ్ విధానం కూడా బాగుంటుందని ఆమె కొనియాడారు. పాకిస్థాన్‌లో పుట్టి మన దేశంలో ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడ్డ పెర్నియా ఖురేషీ బాలీవుడ్‌లో చాలా మంది నటులకు దుస్తులు డిజైన్ చేశారు. అలాగే కూచిపూడి నృత్యం అంటే ఎంతో ఇష్టపడే ఆమె హైదరాబాద్ పేరు చెప్పగానే నాట్యమే గుర్తొస్తుందని తెలిపారు. భారత దేశంలో అనాది నుంచే దుస్తుల్లో ఫ్యాషన్ కనిపించేదని, అలంకరణ విషయంలో భారతీయులది ఒక ప్రత్యేక శైలి అని ఆమె కొనియాడారు.