: గర్భిణులు మద్యం తీసుకుంటే... అది తరాలు వెంటాడుతుంది.. జాగ్రత్త!
మహిళలు గర్భంతో ఉన్న సమయంలో గ్లాస్ వైన్ కానీ, ఇతర మద్యం కానీ తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల మెదడులో అసమతౌల్యత, ప్రవర్తనలో తేడా వస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫలితం కొన్ని తరాలపాటు కొనసాగుతుందని పేర్కొంది. గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పలు హెచ్చరికలు జారీ చేసింది. గర్భిణులు మద్యం తీసుకుంటే అది ఫేటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిసార్డర్స్ (ఎఫ్‌ఏఎస్‌డీ)కి కారణమవుతుందని వివరించారు.
గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కొన్ని తరాల పాటు అంటిపెట్టుకుని ఉంటుందని, తర్వాతి తరంలో ఆల్కహాల్ తీసుకోని వారిపైనా ఆ ప్రభావం పడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన హఫ్‌మ్యాన్ తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్టు ఆయన వివరించారు.
గర్భంతో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వారికి పుట్టే పిల్లల్లో శారీరక బరువు, మెదడు పరిణామం అన్ని తరాల్లోనూ తగ్గిపోతుందని తెలిపారు. కాబట్టి గర్భిణులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచించారు. తద్వారా కొన్ని తరాలను కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. తాజా అధ్యయనానికి సంబంధించిన వివరాలు సెరెబ్రల్ కోర్టెక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.