: ఏం కష్టమొచ్చిందో?... వేర్వేరు ఘటనలలో ఇన్ఫోసిస్ టెక్కీ, హెచ్డీఎఫ్సీ ఉద్యోగిని ఆత్మహత్య!


కర్ణాటకలో ఒకేరోజు వెలుగులోకి వచ్చిన రెండు వేర్వేరు ఘటనల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు ఉద్యోగినులు మరణించారు. బెంగళూరులోని బసవేశ్వరనగర్ హెచ్డీఎఫ్సీ శాఖ ఉద్యోగిని శిల్ప శృంగేరి సమీపంలోని తుంగా నదిలో దూకగా, మైసూరు ఇన్ఫోసిస్ టెక్కీ, తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంకులో గత ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న శిల్ప (26) ఓ హాస్టల్ లో ఉంటోంది. శృంగేరికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న ఆమె, సమీపంలోని నదిలో దూకింది. విషయాన్ని చూసిన ఇతర యాత్రికులు ఆమెను కాపాడాలని ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసులు గజ ఈతగాళ్లతో ఎంతో సేపు గాలిస్తేగానీ ఆమె మృతదేహం లభ్యం కాలేదు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలూ లభ్యం కాకపోవడంతో ఎవరన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. అదే సమయంలో శిల్ప సోదరుడు రాజశేఖర్, ఆమెను కలుద్దామని హాస్టల్ కు రావడం, ఆపై ఆఫీసుకు కూడా రాలేదని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమె ఫోటోలను అన్ని స్టేషన్లకూ పంపిన తరువాతే శిల్పను గుర్తించారు. ఇంకా వివాహంకాని శిల్ప మృతికి కారణాలను విచారిస్తున్నారు.

మరో ఘటనలో, ఏం జరిగిందో ఏమో కానీ, తన ప్రాణాలను బలవంతంగా తీసుకుందో యువతి. మైసూరులోని హెబ్బాళలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న 21 సంవత్సరాల మీనాక్షి, తన గదిలోనే అనుమానాస్పద స్థితిలో విగతురాలిగా కనిపించడం కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుల్బర్గకు చెందిన మీనాక్షి, ఇన్ఫీలో ఉద్యోగం చేస్తోంది. గత నాలుగు రోజులుగా ఆమె ఉద్యోగానికి రాకపోవడంతో, విషయం తెలుసుకుందామని ఫోన్ చేస్తే, స్పందన రాలేదు. ఈలోగా మీనాక్షి అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు ఇరుగు, పొరుగు వారు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, మీనాక్షి మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News