: నేను తొందరగా ఉద్రేక పడిపోతా.. ఆ రోజూ అలాగే జరిగింది!: హార్దిక్ పాండ్యే
ఇంగ్లండ్‌లో ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తీరు భారత అభిమానులను నిరాశ పర్చింది. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా కారణంగా తాను అవుట్ అవడంతో, హార్దిక్ పాండ్యా మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేసి కేకలు కూడా వేశాడు. తాజాగా పాండ్యా ఆ ఘటనపై స్పందించి పలు విషయాలు చెప్పాడు. తాను తరచూ ఆవేశానికి లోనవుతుంటానని అన్నాడు.
అసలు ఈ ఆవేశం అన్న అంశం తన జీవితంలో భాగంగా మారిపోయినట్లుందని పాండ్యా అన్నాడు. తాను తొందరగా ఉద్రేకపడిపోతానని, అయితే వెంటనే మళ్లీ చల్లబడతానని అన్నాడు. సాధారణంగా తాను ఉద్రేకంతో ఊగిపోయిన మూడు నిమిషాల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తానని చెప్పాడు. ఆ రోజు మ్యాచ్ జరిగిన సమయంలోనూ అదే జరిగిందని, తాను ఉద్దేశపూర్వకంగా అలా ప్రవర్తించలేదని అన్నాడు. ఆ రోజు మైదానం వీడి డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తరువాత తనను చూసి తానే నవ్వుకున్నట్లు చెప్పాడు.