: పది కోట్లిచ్చినా అలాంటి కార్యక్రమంలో పాల్గొననంటున్న కోలీవుడ్ నటి
ప్రముఖ నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్' తమిళ ప్రజలను మెల్లిగా ఆకట్టుకుంటోంది. వందరోజులపాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక ఇంట్లో మరికొంతమంది సెలబ్రిటీలతో కలసి ఉండే కాన్సెప్ట్ తో తయారైన ఈ రియాలిటీ షోలో నటుడు శక్తి, శ్రీ, హాస్యనటుడు వయ్యాపురి, గంజాకరుప్పు, నటి నమిత, అనూయ, ఓవియాలతో పాటు మొత్తం 15 మంది పాల్గొంటున్నారు. వీరిలో అనూయ, నటుడు శ్రీలు ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు.
ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటి లక్ష్మీరామకృష్ణన్ స్పందించారు. తనకు పది కోట్లిచ్చినా అలాంటి కార్యక్రమంలో పాల్గొననని స్పష్టం చేశారు. 'బిగ్ బాస్' లో పాల్గొనేందుకు తనను సంప్రదించారని, అయితే వంద రోజులపాటు కుటుంబాన్ని వదిలి ఉండాలన్న షరతును అంగీకరించలేక ఆఫర్ వదులుకున్నానని ఆమె చెప్పారు. అంతే కాకుండా తాను దర్శకత్వం వహించే సినిమా చిత్రీకరణ జరుగుతోందని, మరోవైపు పలు సినిమాల్లో నటిస్తున్నానని ఆ ఆఫర్లను 'బిగ్ బాస్' కోసం వదులుకోవడం సరైన నిర్ణయం కాదని భావించి దానిని అంగీకరించలేదని చెప్పారు.