: హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు!
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా దింపివేసిన సంఘటన ఇటానగర్ లో ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. కిరణ్ రిజిజు, సిబ్బంది, మరో ఏడుగురు వ్యక్తులు గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో ప్రాంతానికి ఎంఐ-17 హెలికాప్టర్ లో వెళుతున్నారు. అయితే, భారీ వర్షాలు, పొగ మంచు కారణంగా హెలికాప్టర్ ముందుకు వెళ్లేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓ పొలంలో పైలట్ దానిని దించివేశాడు. ఎటువంటి ప్రమాదం జరగకుండా హెలికాఫ్టర్ ను కిందకు దింపేందుకు బీఎస్ఎఫ్ పైలట్లు చాలా చాకచక్యంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ‘ఎటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డ నేను చాలా అదృష్టవంతుడిని. ఎంతో అనుభవజ్ఞులైన బీఎస్ఎఫ్ పైలట్లకు నా కృతజ్ఞుతలు’ అన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఇటానగర్ ఎస్పీ సంఘటనా స్థలానికి వచ్చారని, సాయపడేందుకు స్థానికులు కూడా ముందుకువచ్చినట్టు ఆయన చెప్పారు. కాగా, ఈ రోజు రైతులు తమ పొలాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కిరణ్ రిజిజు జిరో ప్రాంతానికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.