: గీతా ఫొగట్, మనుషీ చిల్లర్ లు మీకు కనిపించలేదా?: హర్యాణా సీఎంపై కాంగ్రెస్ ఫైర్
ఘూంఘట్ (మేనిముసుగు) ఉపయోగాన్ని ప్రచారం చేస్తూ హర్యాణా ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `ముసుగు ధరించిన మహిళే హర్యాణా రాష్ట్రానికి గర్వకారణం` అనే ట్యాగ్‌లైన్‌తో `కృషి సంవాద్` మేగజైన్‌లో వచ్చిన ప్రకటన చూసి ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై ప్రతిపక్షం విమర్శల వర్షం కురిపిస్తోంది. `ఈ ప్రకటన బీజేపీ ప్రభుత్వ సంకుచిత స్వభావానికి ప్రతీక. ముసుగు నియమాన్ని పాటించకుండా రాష్ట్రంతో పాటు దేశానికే పేరు తీసుకువచ్చిన హర్యాణా మహిళలు మీ ప్రభుత్వానికి కనిపించడం లేదా?` అంటూ కాంగ్రెస్‌కు చెందిన రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. ఫ్రీ స్టైల్ రెజ్లింగ్‌లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన గీతా ఫొగట్‌ను, మిస్ ఇండియా 2017 టైటిల్ గెలుచుకున్న మనుషీ చిల్లర్‌ను ఆయన ఉదహరించారు.
ఇప్పటికే పురుషాధిక్యత ఎక్కువగా కనిపించే హర్యాణాలో ఇలాంటి ప్రకటనలు జారీచేయడం వల్ల అభివృద్ధి ఎలా జరుగుతుందని నేతలు నిలదీస్తున్నారు. 2015లో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమాన్ని ప్రధాని మోదీ హర్యాణా నుంచే ప్రారంభించిన విషయాన్ని కూడా వారు గుర్తుచేస్తున్నారు.