: గ్రహాంతర జీవులను నాసా గుర్తించిందా?... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
గ్రహాంతర వాసులపై ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేకున్నా, గ్రహాంతరవాసుల ఉనికిని తెలుపుతూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు దర్శనమిస్తాయి. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో గ్రహాంతరవాసులను నాసా గుర్తించిందనే వార్త ఒకటి వైరల్ గా మారింది. ఈ మేరకు నాసాకు చెందిన థామస్ జుర్ బుకెన్ అనే ఉన్నతాధికారి అమెరికన్ పార్లమెంటుకు పూర్తి వివరాలు సమర్పించినట్టు ఆ వార్త చెబుతోంది. మానవజాతి గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారించే విషయమై ఇప్పటివరకూ చేపట్టిన అన్ని కార్యక్రమాలు, ప్రయోగాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ అంచనాకు వస్తున్నట్లు థామస్ వ్యాఖ్యానించినట్టు ఈ వీడియో చూపిస్తుంది.
దీంతో ఈ వీడియో వివరాలు వాస్తవమా? కాదా? అన్న వివరాలను కొందరు ఔత్సాహికులు చూడగా, ఈ వీడియో హ్యాకర్స్ గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా, శని గ్రహపు ఉపగ్రహాల్లో ఒక దానిపై ఆక్సిజన్ ఉన్నట్లు నాసా ఇటీవలే గుర్తించడంతో పాటు, కెప్లర్ టెలిస్కోపు ద్వారా జరిపిన పరిశీలనలతో గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపాపై సముద్రాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బలపడటం ఈ సరికొత్త వీడియో వెలువడడానికి కారణాలుగా అనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గ్రహాంతరవాసుల ఉనికిపై నాసా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.