: సుబ్రహ్మణ్యస్వామిపై ట్విట్టర్ దాడికి దిగిన రజనీకాంత్ అభిమానులు


బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. తమిళనాట రజనీ రాజకీయరంగ ప్రవేశంపై ఉత్కంఠ నెలకొన్న వేళ 'రజనీకాంత్ పిరికి వాడని, నిర్ణయాలు తీసుకోలేడ'ని సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆయనపై రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రజనీ రాజకీయ ప్రవేశం తథ్యం అని తేలిన నేపథ్యంలో మరోసారి ఆయన 'రజనీకాంత్ ఆర్థిక నేరగాడు.. రాజకీయాల్లోకి రాకూడ'దంటూ విమర్శలు చేశారు. దీనిపై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిపై ట్విట్టర్ దాడి మొదలుపెట్టారు. తమ నాయకుడిపై ఉన్న అభిమానం, ఆయన ఆదేశాలు తమను కట్టిపడేస్తున్నాయని, ఆయన చిన్న మాట చెబితే తమ ప్రతాపం చూపేవాళ్లమని పలువురు అభిమానులు సుబ్రహ్మణ్యస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే, మరో అభిమాని స్పందిస్తూ,  ఢిల్లీలో కూర్చుని ఎవరిపై పడితే వాళ్లపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. రాజకీయాల్లో సీనియర్ గా ఉంటూ ఇవేం నీఛపు రాజకీయాలు? అని ఒక అభిమాని హితవు పలికారు. తమ అభిమాన హీరో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరికొందరు అభిమానులు...బీజేపీలోకి రజనీని లాగే ప్రయత్నం చేసిన నేతలు సుబ్రహ్మణ్యస్వామిని ఎందుకు కట్టడి చేయడం లేదని నిలదీశారు. రజనీ మీద అభిమానం ఉంటే ముందు అతనిని కట్టడి చేయాలని సూచించారు. హిందూ మక్కల్‌ కట్చి నేత అర్జున్‌ సంపత్‌ ఒక అడుగు ముందుకు వేసి...సుబ్రహ్మణ్యస్వామి ఇకనైనా, రజనీని విమర్శించడం మానుకోకుంటే, స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News