: అమెరికా గొప్పదనానికి మీరే నిదర్శనం: సోమాలియా శరణార్థులతో జుకర్ బర్గ్
అమెరికాలోని మినియాపొలిస్‌లో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన మొదటి ఇఫ్తార్ విందును స్వీకరించారు. కొంతమంది సోమాలియా శరణార్థులు ఇచ్చిన ఈ విందు ద్వారా ప్రపంచాన్ని ఒక దగ్గరికి చేరువ చేయాలనే తమ సంస్థ నినాదాన్ని వ్యక్తపరిచారు. ఈ విందు గురించి తన ఫేస్‌బుక్ వాల్‌పై జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. `శరణార్థులుగా మీరు ఏ దేశానికి చెందినవారో నిర్ణయించుకోవడం కష్టం. 26 ఏళ్లు శరణార్థ శిబిరంలో గడిపి అమెరికాలో స్థిరపడిన ఓ వ్యక్తిని ఈ ప్రశ్న అడిగినపుడు 'మనకు స్వేచ్ఛను ప్రసాదించిన దేశమే మనది. అమెరికాలో అందుకు లోటు లేదు' అని సమాధానమిచ్చాడు.` అని జుకర్ బర్గ్ పోస్ట్‌లో తెలిపారు.
ఇఫ్తార్ విందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ - `అమెరికా గొప్పదనానికి మీరే నిదర్శనం. మనది కాని దేశంలో బలవంతంగా జీవించడానికి చాలా ధైర్యం కావాలి` అని శరణార్థులను ఉద్దేశిస్తూ పోస్ట్‌లో కొనియాడారు. ఇటీవల ఫేస్‌బుక్ తమ నినాదాన్ని `ప్రపంచాన్ని ఒక దగ్గరికి చేరువ చేద్దాం` అని మార్చుకున్న సంగతి తెలిసిందే.