: భార్యల అక్రమ సంబంధాలపై భర్తల ఫిర్యాదుల వెల్లువ... తల పట్టుకుంటున్న పుణె పోలీసులు!
పుణె పోలీసులు తమకు వస్తున్న ఫిర్యాదులపై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్న పరిస్థితి. తమ భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని మహిళా పోలీసు విభాగానికి లెక్కకు మించిన ఫిర్యాదులు వస్తుండటంతో, ఈ రివర్స్ గేర్ సమస్యలను ఎలా డీల్ చేయాలో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఇతరులతో తమ జీవిత భాగస్వాములు బంధం పెట్టుకుని, తమను పట్టించుకోవడం లేదని వచ్చిన ఫిర్యాదుల సంఖ్య ఐదు నెలల్లో 146కు చేరింది. జనవరిలో 24, ఫిబ్రవరిలో 23, మార్చిలో 49, ఏప్రిల్ లో 25, మేలో 25 చొప్పున ఫిర్యాదులు అందాయని అధికారులు చెబుతున్నారు. భార్యలు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని, ఇల్లు రాసివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని వచ్చిన ఫిర్యాదులూ వీటిల్లో ఉన్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాల ఘటనలపై సత్వరం దర్యాప్తు నిమిత్తం స్పెషల్ గా ఏర్పాటైన మహిళా పోలీసు విభాగానికి ఈ తరహాలో భార్యా బాధితులు వెల్లువెత్తుతుండటం పుణెలో అధికంగా కనిపిస్తోంది.