: అందుకే ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు: తేల్చి చెప్పిన సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్‌లో సంచలనం కలిగిస్తోన్న బ్యూటీషియన్ శిరీష మృతి కేసు గురించి హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి వివరాలు తెలిపారు. కుకునూర్ పల్లిలోని తన రూం నుంచి శిరీష వెళ్లిపోయిన తరువాత హైదరాబాద్‌లో శిరీష ఆత్మహత్య చేసుకుందని ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలుసుకుని భయపడిపోయారని అన్నారు. ఈ నెల 13న ఉదయం 8.30కి ప్రభాకర్ రెడ్డి ఓ పోలీసుకి పలు సార్లు ఫోన్ చేసి ఈ కేసులో వివరాలు తెలుసుకున్నాడని అన్నారు. ఈ కేసులో శిరీష భర్త నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారని, మీ దగ్గరకు వచ్చి మద్యం తాగారని నిందితులు పోలీసులకి చెబుతున్నారని ప్రభాకర్ రెడ్డికి ఓ పోలీసు తెలిపారని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు.
దీంతో తన ప్రవర్తన వల్లే శిరీష ఆత్మహత్య చేసుకుందని, తనపై విచారణ ప్రారంభమవుతుందని భావించిన ప్రభాకర్ రెడ్డి ఎంతో ఒత్తిడికి గురయ్యారని అన్నారు. దీంతో ఎస్సై ప్రభాకర్ రెడ్డి అదే రోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఇక్కడ శిరీష.. అక్కడ ప్రభాకర్ రెడ్డి గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని అన్నారు.